Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ గ్రామంలో రాత్రయితే చాలు హడల్.. ఇళ్లపై రాళ్ల వర్షం.. అంతుచిక్కని మిస్టరీ!

Appajipeta village mystery stone rain on houses at night causes panic
Advertisement
  • అనంతపురం జిల్లా అప్పాజీపేటలో వింత ఘటన
  • రాత్రిపూట ఇళ్లపై కురుస్తున్న రాళ్ల వర్షం
  • పోలీసుల గస్తీ ఉన్నా ఆగని దాడులు
  • భయంతో ఇళ్లకే పరిమితమవుతున్న గ్రామస్థులు
  • ఇది అతీత శక్తుల పనేనని కొందరి అనుమానం
Advertisement
అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో చీకటి పడితే చాలు, ప్రజలు తీవ్ర భయాందోళనలతో వణికిపోతున్నారు. రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని రాళ్లు ఇళ్లపై వర్షంలా కురుస్తుండటంతో, ఏం జరుగుతుందో అర్థంకాక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ వింత ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. పామిడి మండలం పరిధిలోని అప్పాజీపేట గ్రామంలో గత వారం రోజులుగా ఈ అంతుచిక్కని ఉదంతం చోటుచేసుకుంటోంది. ప్రతిరోజూ రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఇళ్లపై ఎవరో భారీ రాళ్లను విసురుతున్నారు. కొద్ది నిమిషాల వ్యవధిలో దాడులు పునరావృతం అవుతున్నాయి. గ్రామంలో చాలా ఇళ్లు రేకుల షెడ్లు కావడంతో, ఈ రాళ్ల దాడికి అవి దెబ్బతింటున్నాయి. ఈ ఘటనల్లో ఇద్దరు గ్రామస్థులకు స్వల్ప గాయాలయ్యాయి.

మొదట ఇది ఆకతాయిల పనేనని భావించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, గ్రామంలో నలుగురు కానిస్టేబుళ్లతో గస్తీ ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు పోలీసులు పహారా కాసినా రాళ్ల దాడులు ఆగలేదు. దీంతో, గ్రామ యువకులు సుమారు 20 మంది పోలీసులతో కలిసి సమీపంలోని ఓ గుట్టపైకి ఎక్కి కాపలా కాశారు. అయినా సరే, వారు చూస్తుండగానే ఇళ్లపై రాళ్లు పడటంతో అంతా నివ్వెరపోయారు.

పోలీసులు, యువకుల ప్రయత్నాలు విఫలం కావడంతో గ్రామస్థుల్లో భయం రెట్టింపైంది. చీకటి పడగానే ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. కొందరు గ్రామస్థులు ఇది దెయ్యాలు లేదా ఇతర అతీత శక్తుల పనేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాము కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నామని, అధికారులు స్పందించి ఈ మిస్టరీని ఛేదించి తమను కాపాడాలని వేడుకుంటున్నారు.

గతంలో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల్లోనూ ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. 2024లో తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో ఓ గ్రామంలో కూడా ఇలాగే ఇళ్లపై రాళ్లు పడిన ఉదంతం సంచలనం సృష్టించింది. ప్రస్తుతానికి అప్పాజీపేటలో ఈ రాళ్ల దాడి మిస్టరీ వీడకపోవడంతో, గ్రామస్థులు భయంతోనే కాలం గడుపుతున్నారు.
Advertisement
Advertisement
Appajipeta
Anantapur stone pelting
Pamidi Mandal news
Andhra Pradesh mystery
Mystery stone rain
Village stone attacks

More Telugu News